కంచ ఐలయ్య: నన్ను చంపాలనుకుంటున్నారు.. ఎవరు అడ్డువచ్చినా విజయవాడ సభకు వెళతా: కంచ ఐలయ్య
- ఈ నెల 28న విజయవాడలో కంచ ఐలయ్యకు సన్మానం
- నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- నరకాసురుడు, రాముడు, దీపావళి గురించి నేను మాట్లాడలేదు
- ప్రింట్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు వస్తున్నాయి
ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించలేమని, అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో ఐలయ్యకు కొందరు సన్మానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభ కనుక నిర్వహిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఆర్యవైశ్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై స్పందించిన కంచ ఐలయ్య ఎవరు అడ్డువచ్చినా తనను ఆపలేరని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఆ సభకు తాను హాజరై తీరుతానని ఉద్ఘాటించారు.
తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఐలయ్య మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనపై తప్పుడు వార్తలు రాయిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా టీజీ వెంకటేశ్, పరిపూర్ణానంద లాంటి వారు తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తాను నరకాసురుడిని గురించి గానీ, రాముడి గురించి గానీ, దీపావళి గురించి కానీ అస్సలు మాట్లాడలేదని అన్నారు. తాను మాట్లాడానో లేదో కూడా తెలుసుకోకుండా తనపై ప్రింట్ మీడియాలోనూ వార్తలు రాశారని ఆయన పేర్కొన్నారు.
తాను వేదాలను కూడా దూషించానని వార్తలు రాయించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కంచ ఐలయ్య వాపోయారు. తాను బెంగళూరులో అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయానని కూడా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై దాడి చేయడానికి ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రేరేపిస్తాయని చెప్పారు. పత్రికల్లోనూ ఇలారాస్తే తనపై దాడి చేయాలనుకుంటున్నవారు అది పట్టుకొచ్చి ఇలా రాశారు కాబట్టి దాడి చేస్తున్నామని అంటారని ఐలయ్య అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత తాను ఎవ్వరినీ అవమానించలేదని ఆయన అన్నారు. తనపై ఇటువంటి వార్తలు రాయించడం వెనుక ఆర్యవైశ్యులు ఉన్నారని ఆరోపించారు. తనపై దాడి జరిగే విధంగా రెచ్చగొడుతూ తాను అనని మాటలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనను అడిగి నిర్ధారించుకోకుండానే ప్రింట్ మీడియాలో తన గురించి కొన్ని వార్తలు వస్తున్నాయని తెలిపారు.