విమానం ఇంజిన్: విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసిన బామ్మ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- చైనాలోని అన్హూయీ ప్రాంతంలోని విమానాశ్రయంలో ఘటన
- అలా చేస్తే ప్రయాణం క్షేమంగా జరుగుతుందని భావించిన బామ్మ
- రాత్రంతా ఎయిర్ పోర్టులోనే విమానం
రైల్లో ప్రయాణం చేస్తోన్న వేళ నదులు కనపడితే భారతీయులు నీళ్లలో రూపాయి నాణేలు వేయడం వంటివి చేస్తుంటారు. అలా చేస్తే మంచిదని భావిస్తారు. అయితే, ఓ బామ్మ లక్కీ ఎయిర్ జెట్‌కు చెందిన విమానం ఎక్కుతూ, ఆ విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసిన ఘటన చైనాలోని అన్హూయీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కాయిన్స్ వేస్తే తన ప్రయాణం క్షేమంగా జరుగుతుందన్న మూఢనమ్మకంతో ఆమె ఇలా చేసింది. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి తెలిపారు. దీంతో పరిశీలించిన సిబ్బందికి ఆ బామ్మ విసిరిన కాయిన్స్ విమానం పక్కనే కింద కనిపించాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ట్రాన్స్ పోర్ట్ పోలీసులు ఆ బామ్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. ఉదయాన్నే ఆ విమానం ప్రయాణికులతో అన్హూయీ నుంచి కన్మింగ్ వెళ్లింది.
ఈ ఏడాది చైనాలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. షాంఘై ఫుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని నెలల క్రితం గంగ్జౌ పట్టణానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం ఇంజిన్‌లో 80 ఏళ్ల బామ్మ ఇలాగే కాయిన్స్ వేసింది.