విరాట్ కోహ్లీ: వన్డేలలో నెం.1 ర్యాంకు నుంచి రెండో ర్యాంకుకి విరాట్ కోహ్లీ!
- వన్డేల్లో 879 పాయింట్లతో అగ్రస్థానంలో ఏబీ డెవిలియర్స్
- 877 పాయింట్లతో విరాట్ కోహ్లీకి రెండో స్థానం
- బౌలింగ్ లో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీకి అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ రోజు ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియాను వెనక్కి నెట్టేసిన దక్షిణాఫ్రికా అగ్రస్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వన్డేల్లో తన మొదటి ర్యాంకును కోల్పోయాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డెవిలియర్స్ 879 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 877 పాయింట్లతో ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో ర్యాంకుకు పడిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న వన్డేల్లో భాగంగా రెండో వన్డేలో డెవిలియర్స్ 176 పరుగులు బాదిన విషయం తెలిసిందే.
ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లలో టాప్ టెన్‌లో కోహ్లీ, రోహిత్‌శర్మ మాత్రమే ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గతంలో కంటే రెండు స్థానాలు కోల్పోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో పాకిస్థాన్ బౌలర్ హసన్‌అలీ మొదటి స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రా ఆరోస్థానంలో ఉండగా, అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.