రావుల: మోత్కుపల్లి ఒకలా మాట్లాడితే... రావుల మరోలా మాట్లాడిన వైనం!
- ఈ రోజు సమావేశంలో రేవంత్ రెడ్డి అంశం చర్చించలేదు
- మీటింగ్ అయ్యాకే మోత్కుపల్లి వెళ్లిపోయారు
- ఈ నెల 26న టీడీఎల్పీ సమావేశం
- రేవంత్ రెడ్డి వస్తానన్నారు
ఈ రోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం గరం గరంగా జరిగిన విషయం తెలిసిందే. సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి... తమ పార్టీలో వచ్చిన విభేదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తమ సమావేశంలో అసలు రేవంత్ రెడ్డి అంశమే చర్చించలేదని అన్నారు.
ఈ సమావేశం నుంచి మోత్కుపల్లి మధ్యలోనే వెళ్లిపోయారన్న వార్తలో వాస్తవం లేదని రావుల వ్యాఖ్యానించడం గమనార్హం. మీటింగ్ అయ్యాకే ఆయన వెళ్లారని వ్యాఖ్యానించారు. ఈ నెల 26న టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి వస్తానని రేవంత్ తమకు మాటిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డి ఈ రోజు తన అభిప్రాయాలను చెప్పారని అన్నారు.
కాగా, అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ, తాను సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేశానని, రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన తీరు నచ్చలేదని చెప్పారు. అంతేగాక మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.