రేవంత్ రెడ్డి: ఇది నమ్మక ద్రోహం కాదా?: రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి ఆగ్రహం
- రేవంత్ రెడ్డి తన తప్పును సరిదిద్దుకోవాలి
- చంద్రబాబును అడగకుండా రాహుల్‌ని కలిసే హక్కు రేవంత్ రెడ్డికి లేదు
- రేవంత్ రెడ్డి మంచివాడిగా నటిస్తూ కాకమ్మ కథలు చెబుతున్నారు
- రేవంత్ రెడ్డి తీరువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు
తమ పార్టీ నేత రేవంత్ రెడ్డి తనలో తప్పుంటే సరిదిద్దుకోవాలని, ఆ అవకాశం తాము ఇస్తామని టీడీపీ నేత మోత్కుపల్లి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోకుండా రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని కలిశావా? లేదా? అని అడిగానని అన్నారు. ఆ విషయాన్ని దాటవేసే ధోరణితో తాను చంద్రబాబు నాయుడితో సమాధానం చెప్పుకుంటానని అన్నారని చెప్పారు. చంద్రబాబును అడగకుండా రాహుల్‌ని కలిసే హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.
ఇంత మంది సీనియర్లను అడగకుండా రేవంత్ రెడ్డి రాహుల్‌ని ఎలా కలుస్తారని మోత్కుపల్లి ప్రశ్నించారు. పరిటాల సునీత, యనమల రామకృష్ణుడిపై ఎందుకు విమర్శలు చేశావని రేవంత్ రెడ్డిని అడిగితే సమాధానం లేదని అన్నారు. ఆంధ్రా క్యాబినెట్ మీద ఆయన విమర్శలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ‘అసలు రేవంత్ రెడ్డి స్థాయి ఏంటీ? మమ్మల్నందర్నీ కాదని రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. అటువంటప్పుడు ఇప్పుడిలా ప్రవర్తించడం నమ్మక ద్రోహం కాదా? ఎన్నికలు జరిగిన తరువాత రేవంత్ రెడ్డి తీరువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు’ అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి మంచివాడిగా నటిస్తూ కాకమ్మ కథలు చెబుతూ పార్టీ గురించి కాకిలా అరుస్తున్నారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఆయనకు పార్టీ ఆఫీసులో ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయని, అటువంటి నాయకుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతామని అన్నారు. రాహుల్ గాంధీని కలిస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. ఇంక రేవంత్‌రెడ్డితో మాట్లాడే అవసరం తమకేముందని ప్రశ్నించారు.