ఆరుగురి మృతి: అతి వేగంగా కారు నడిపి రోడ్డుపై బీభత్సం సృష్టించిన ఉక్రెయిన్ యువతి.. ఆరుగురి మృతి
- ఉక్రెయిన్‌లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన యువతి
- ఆమె కారును అక్కడికక్కడే ధ్వంసం చేసిన స్థానికులు
- బాడీగార్డుల సాయంతో తప్పించుకున్న యువతి
రోడ్డుపై అతి వేగంగా తమ ఇష్టానుసారం కారు నడుపుతూ కొందరు యువకులు యాక్సిడెంట్స్ చేయడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఆ సమయంలో వారు ప్రమాదంలో పడడమే కాకుండా.. రోడ్డున పోయే అమాయకుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఇదే విధంగా ఉక్రెయిన్‌లో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కారు నడిపి ఓ యువతి సృష్టించిన బీభత్సం ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కింది.
అతి వేగంగా.. అడ్డదిడ్డంగా కారును నడిపి ఆ యువతి ఆరుగురి ప్రాణాలను బలితీసింది. దీంతో స్థానికులు ఆమె కారును అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఆ యువతి వెనుక వాహనంలో బాడీగార్డులు ఉండడంతో ఆమె స్థానికుల చేతిలో దెబ్బలు తినకుండా తప్పించుకోగలిగింది. ఆ దేశంలో ధనవంతుల్లో ఒకరైన వాసిలీ జైస్టేవ్ కూతురు అల్‌యోనా జైస్టేవ్ (20) ఈ ఘటనకు పాల్పడింది.
ఆమె అత్యంత విలాసవంతమైన కార్లను స్వయంగా డ్రైవ్ చేస్తూ ఉండేది. ఇటీవల ఆమె రోడ్డుపై వెళ్తుండగా రెడ్ సిగ్నల్ పడింది. అయినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. పోలీసులు ఆపుతారేమోనన్న భయంతో మరింత వేగంగా దూసుకెళ్లింది. దీంతో రోడ్డు దాటుతున్న పాదచారులను ఢీ కొట్టింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి పదేళ్ల జైలుశిక్ష పడవచ్చని తెలుస్తోంది.