ప్రత్యూష తల్లి: సిస్టర్ రోల్స్ వస్తే చేయొద్దని నా కూతురికి చెప్పా : నాటి నటి ప్రత్యూష తల్లి
- నాటి విషయాలను ప్రస్తావించిన దివంగత నటి ప్రత్యూష తల్లి సరోజినీ దేవీ
- హీరోయిన్ గా అవకాశాలొస్తేనే చెయ్యమన్నా
- ఏడెనిమిది నెలల పాటు సినిమాలు మాన్పించా
‘రాయుడు’, ‘శ్రీరాములయ్య’, ‘సముద్రం’...తదితర చిత్రాల్లో నటించిన నాటి నటి ప్రత్యూష గుర్తుండే ఉంటుంది. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రత్యూష, కొన్ని కారణాల వల్ల 2002లో ఆత్మహత్య చేసుకుంది. ‘సిస్టర్’ పాత్రల ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించిన ప్రత్యూషకు ఆ తర్వాత చిత్రాల్లో కూడా ఇదే తరహా పాత్రలు వస్తుండేవి. ఒకానొక దశలో తన కూతురితో ఆ పాత్రలు చేయొద్దని చెప్పానని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి గుర్తుచేసుకున్నారు.
'తెలుగు పాప్యులర్ డాట్ కామ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ప్రతి చిత్రంలో సిస్టర్ పాత్రలో నటించే అవకాశాలే ప్రత్యూషకు వస్తుండేవి. అప్పుడు, మా అమ్మాయి హోటల్ మేనేజ్ మెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ‘సిస్టర్ పాత్రలు వస్తే నటించొద్దు. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకో..హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేయి. హీరోయిన్ రోల్ వస్తే వెళదాం. లేకపోతే, వద్దు' అని చెప్పాను. ఏడెనిమిది నెలల పాటు సినిమాల జోలికి వెళ్లనీయకుండా చేశాను. ఆ తర్వాత ‘స్నేహమంటే ఇదేరా’ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే ప్రత్యూష నటించింది’ అని చెప్పుకొచ్చారు.