రేవంత్ రెడ్డి: పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిస్తే తప్పేంటి?: రేవంత్ రెడ్డి
- టీఆర్ఎస్ నేతల చందాల వసూలుపై కేసు వేస్తా
- కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం
- డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలనుకుంటున్నా
- మీడియాతో రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు వేసేందుకే తాను ఢిల్లీ వెళ్లానని టీడీపీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’ పేరుతో చందాల వసూలుపై ఢిల్లీలో కేసు వేస్తానని, కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో కీలకపాత్ర వహిస్తానని, డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పారు. తాను చంద్రబాబును అపాయింట్ మెంట్ అడగలేదని, తెలంగాణలో పార్టీలు లేవని, కేసీఆర్ వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ నేతలపైనా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఏపీ నేతలు అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతున్నారంటూ మండిపడ్డారు.