నరేంద్ర మోదీ: అప్పుడు మోదీని సమర్ధించి తప్పు చేశా.. క్షమించండి!: కమలహాసన్

  • గ‌త ఏడాది పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న మోదీ
  • అప్పట్లో మద్దతిచ్చి తప్పుచేశానన్న కమల్
  • ధనవంతుల కోసమే మోదీ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని విమ‌ర్శ

గ‌త ఏడాది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తాను తొందరపడి సమర్ధించాన‌ని సినీన‌టుడు క‌మ‌లహాస‌న్ అన్నారు. ఆ విష‌యాన్ని సమర్ధించ‌డం తాను చేసిన పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. తాజాగా తమిళ మ్యాగజైన్ 'వికటన్'కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో క‌మ‌లహాస‌న్ మాట్లాడుతూ... ధనవంతుల కోసమే మోదీ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని విమ‌ర్శించారు. మోదీ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల‌ సామాన్య ప్రజల‌కు ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.  

ఆ అనాలోచిత నిర్ణయం వ‌ల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కమల్ అన్నారు. మోదీ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ వారిమాటలు ప‌ట్టించుకోకుండా మోదీకి మద్దతిచ్చి తప్పు చేశానని ఆయ‌న చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించినందుకు తనను ప్రజలు క్షమించాలని కోరారు. గత ఏడాది నవంబర్ 8న మోదీ తీసుకున్న నిర్ణయంపై కమల్ స్పందిస్తూ 'సెల్యూట్ మోదీ' అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News