రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ నేత రేవంత్ రెడ్డి భేటీ?
- ఢిల్లీలో రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ లో చేరనున్నారని వార్తలు
- రేవంత్ రెడ్డి ప్రకటన చేయనప్పటికీ బలపడుతోన్న అనుమానాలు
- వచ్చేనెల 9న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై దీటుగా విమర్శల దాడి చేసే టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండిస్తున్నప్పటికీ, ఆయన మాత్రం కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నట్లు సమాచారం.
అలాగే వచ్చేనెల 9న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్న పలువురు టీడీపీ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది.