వీణావాణీ: సీఎం కేసీఆర్ ను కలవాలని ఉంది: అవిభక్త కవలలు వీణావాణీ
- ‘నీలోఫర్’ లో పుట్టినరోజు జరుపుకున్న వీణావాణీలు
- కేక్ కట్ చేసిన కవలలు..శుభాకాంక్షలు చెప్పిన ఆసుపత్రి సిబ్బంది
- భవిష్యత్తులో ఇంజనీర్ ఒకరు, సైంటిస్ట్ మరొకరు కావాలనే కోరిక
సీఎం కేసీఆర్ ను కలవాలని ఉందని అవిభక్త కవలలు వీణావాణీ చెప్పారు. భవిష్యత్ లో ఒకరు ఇంజనీర్, మరొకరు సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నామని వారు చెప్పారు. వీణావాణీ తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మి మాట్లాడుతూ, ఆపరేషన్ చేసి వారిని విడదీయాలని, వచ్చే ఏడాదికి వీణావాణీలు విడివిడిగా తమ పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.
కాగా, హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిన్న వీణావాణీల పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించారు. ఆసుపత్రి వైద్యులు, నర్సులు..వీణావాణీలకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉండగా, 2003 అక్టోబర్ 15న ఈ చిన్నారులు కవలలుగా జన్మించారు. వీరి రెండు తలలు అతుక్కుని పుట్టడంతో, చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వారు ఈ ఆసుపత్రిలోనే డాక్టర్ల సంరక్షణలో వుంటున్నారు.