అసదుద్దీన్ ఒవైసీ: ప్రజల సొమ్మును 100 మీటర్ల రాముడి విగ్రహం నిర్మించడానికి ఎలా ఉపయోగిస్తారు?: అసదుద్దీన్ ఒవైసీ
- మత సంబంధిత విషయాలకు ప్రజల సొమ్మును ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది
- రాముడి విగ్రహాన్ని నిర్మిస్తామని యూపీ సర్కారు నిర్ణయం తీసుకుంది
- ట్రంప్‌ని మోదీ కౌగిలించుకొని మరీ వచ్చారు
- ఇప్పుడు భారత్ ను అమెరికా ప్రశ్నిస్తోంది
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైన, భారతీయ జనతా పార్టీపైన హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి మండిపడ్డారు. ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును మత సంబంధిత విషయాలకు ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినప్పటికీ అయోధ్యలో 100 మీటర్ల పొడవైన రాముడి విగ్రహాన్ని నిర్మిస్తామని యూపీ సర్కారు నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. ఇది కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు.
ఓవైపు ప్రజల సొమ్మును ప్రార్థనా మందిరాల పునర్నిర్మాణం, మరమ్మతులకు ఉపయోగించకూడదని కోర్టు స్పష్టంగా చెబితే, మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ రాముడి విగ్రహ నిర్మాణానికి ఎలా ఉపయోగిస్తారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌ను మెచ్చుకున్న అంశంపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ... ట్రంప్‌ని మోదీ కౌగిలించుకొని మరీ వచ్చారని, ఇప్పుడు అమెరికా తన అసలు వైఖరిని బయట పెట్టిందని అన్నారు. అంతేగాక, భారత్‌లోని బానిసత్వంతో పాటు గౌరీ లంకేశ్ హత్య కేసు గురించి, కంచ ఐలయ్యకు వస్తోన్న బెదిరింపుల గురించి అమెరికా ప్రశ్నించిందని విమర్శించారు.