చంద్రబాబు: రోబోలుగా మార్చే కార్పొరేట్ విద్యా విధానాన్ని సహించను: సీఎం చంద్రబాబునాయుడు
- ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సీఎం సమీక్ష
- విద్యార్థులను వేధించే పద్ధతులకు స్వస్తి చెప్పాలి
- నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై కఠిన చర్యలు
- ఇంటర్ మీడియట్ లో గ్రేడింగ్ విధానం తీసుకురావాలి
రోబోలుగా మార్చే కార్పొరేట్ విద్యా విధానాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని, విద్యార్థులను చదువుకే పరిమితం చేయవద్దని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయా కళాశాలల యాజమాన్యాలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విద్యార్థులను వేధించే పద్ధతులకు తక్షణం స్వస్తి చెప్పాలని, నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంటర్ మీడియట్ లో ర్యాంకుల పద్ధతిని ఎత్తివేసి గ్రేడింగ్ విధానాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.