వర్మ: ఎన్టీఆర్ పాత్రలో నటించే నటుడిని ఇప్పటికే ఎంపిక చేశాను: వర్మ
- ఓ కొత్త నటుడిని ఎన్టీఆర్ గా చూస్తారు
- ఇప్పటికే ఆయనకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టా
- ఈ సినిమాలోని పాత్రల్లో ఎవరిని, ఎలా చూపిస్తానో చెప్పను
- ఈ సినిమాని కొందరు గుడ్ అంటారు.. కొందరు బ్యాడ్ అంటారు
ఎన్టీఆర్ పాత్రలో నటించే నటుడిని తాను ఇప్పటికే ఎంపిక చేశానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఓ కొత్త నటుడిని ఎన్టీఆర్ గా చూస్తారని, ఇప్పటికే ఆయనకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టానని చెప్పారు. ఈ సినిమాలోని పాత్రల్లో ఎవరిని, ఎలా చూపిస్తానో తాను చెప్పనని అన్నారు. ‘నన్ను గుడ్ అనుకునే వారు నా వ్యూలో ఈ సినిమా చూసి గుడ్ అంటారు.. నేను నచ్చని వారు ఈ సినిమాను బ్యాడ్ అనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
తాను ఈ సినిమా తీయడానికి ఎన్టీఆర్ గురించి తెలుసుకోవడానికి ఎవ్వరినీ సంప్రదించబోనని వర్మ అన్నారు. తాను తీసుకున్న సోర్సు ప్రకారం సినిమా తీస్తానని అన్నారు. తాను ఎన్టీఆర్ చరిత్రపై అధ్యయనం చేశానని అన్నారు. లక్ష్మీ పార్వతి పాత్ర గ్లామరస్‌గా ఉండబోదని అన్నారు. ఈ సినిమాలో ఆడవారిని గ్లామర్‌గా తీసుకోవడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ ను ఆకర్షించడానికి ఆమెలో ఉన్న ప్రత్యేకతలేంటో చూపిస్తానని అన్నారు. ఆమె పాత్రలో ఏ నటి నటిస్తుందన్న విషయాన్ని కూడా వర్మ చెప్పలేదు. ఈ సినిమాను నిర్మిస్తోన్న వైసీపీ నేత కూడా ఎన్టీఆర్ అభిమానేనని అన్నారు.