చంద్రబాబు: జగన్ 'అన్న’ కాదు అవినీతి కొండ : ఏపీ మంత్రి దేవినేని విమర్శ
- చంద్రబాబుకు జగన్ లేఖ రాయడం సిగ్గుచేటు
- ‘అన్న’ వస్తున్నాడంటే ప్రజలు తిట్టుకుంటున్నారు
- ‘పట్టిసీమ’పై వైసీపీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఉమ డిమాండ్
రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై మంత్రి దేవినేని విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్న వస్తున్నాడంటే రాష్ట్ర ప్రజలు తిట్టుకుంటున్నారని, ‘అన్న’ కాదు అవినీతి కొండ వస్తున్నాడని అనుకుంటున్నారని జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకూడదని కేసులు వేస్తున్నారని, ‘పట్టిసీమ’ నీటితో రాయలసీమను రతనాల సీమ చేస్తామని, ‘పట్టిసీమ’పై వైసీపీ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి జగన్ ప్రతిపక్ష నేత కావడం మా కర్మ అని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడం ఆనందదాయకమని, 240 మండలాల్లో అధిక వర్షపాతం, 340 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన ఉంటుందని, 2018 నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేశామని ఈ సందర్భంగా దేవినేని హామీ ఇచ్చారు.