సాయి ధరమ్ తేజ్: ఈ రోజు నా పుట్టిన రోజన్న సంగతే మర్చిపోయా! : హీరో సాయిధరమ్ తేజ్
- దర్శకుడు వి.వి. వినాయక్ చిత్రంలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్
- సెట్స్ లో బర్త్ డే వేడుకలు
- నటుడిగా ఇంకా ఎదగలేదు..నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న తేజ్
ఈరోజు తన పుట్టినరోజనే విషయం తనకు ఎంత మాత్రం గుర్తులేదని హీరో సాయిధరమ్ తేజ్ అన్నాడు. ప్రస్తుతం వి.వి.నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న ధరమ్ తేజ్ వద్దకు ఓ టీవీ ఛానెల్ ప్రతినిధి వెళ్లి, బర్త్ డే విషెస్ చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. బిజీగా ఉండటం వల్ల ఈరోజు తన పుట్టినరోజనే విషయం కూడా గుర్తులేదని అన్నాడు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్, చిత్ర బృందం సమక్షంలో సాయి ధరమ్ తేజ్ కేక్ కట్ చేశాడు.
అనంతరం, సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత తాను జరుపుకుంటున్న మూడో పుట్టినరోజని, అభిమానులు తమపై చూపించే ప్రేమను మాటల్లో వర్ణించలేమని చెప్పాడు. నటుడిగా తాను ఇంకా ఎదగలేదని, నేర్చుకోవడమనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ప్రతి దర్శకుడి దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని అన్నాడు.
ఎమోషనల్ సీన్స్ కు రిహార్సల్స్ చేయాలంటే తనకు కష్టంగా ఉంటుందని .. అది తన వల్ల కాదని అన్నాడు. ఎమోషనల్ సీన్స్ కు తాను సిద్ధమయ్యే ముందు సెపరేట్ గా కూర్చుని విషాద సంగీతాన్ని వింటానని చెప్పాడు. డ్యాన్సింగ్, ఫైట్స్ ని, ముఖ్యంగా కామెడీ సీన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు.