కాంగ్రెస్: నాందేడ్ ఫలితాలు దేశానికి పెద్ద మలుపు: ఏపీసీసీ సంబరాలు
- విజయవాడ ఏపీసీసీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్న నేతలు
- ఈ ఫలితాలు రాహుల్ గాంధీ చేసిన కృషికి నిదర్శనం
- రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు కావాలి
భారతీయ జనతా పార్టీ ఓటమి ప్రయాణం నాందేడ్ నుంచి ప్రారంభమైందని, నాందేడ్ ఫలితాలు దేశానికి పెద్ద మలుపు కాబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి వి.గురునాథం అన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ చేతిలో ఓడిన సందర్భంగా ఈ రోజు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి వి.గురునాథం మాట్లాడుతూ నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రావడం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన కృషికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోరుకుంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీసీ కార్యదర్శి పొనుగుపాటి నాంచారయ్య, అన్వర్ హుసేన్, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జీ వెన్న రమేష్, సెంట్రల్ నియోజకవర్గ బ్లాక్ ప్రెసిడెంట్ జి.హనుమంతరావు, మైనార్టీ నాయకులు సలీమ్ పర్వేజ్, భాదర్, బీసీ నాయకులు బి.దుర్గా ప్రసాద్, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కుల ఇందిర, పెరికె కిరణ్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.