సూర్యాపేట: సూర్యాపేటకు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్!
- సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేస్తాం
- ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు.. తండాకు రూ.10 లక్షలు
- బంజారా భవన్ నిర్మిస్తాం .. పుల్లారెడ్డి చెరువు బాగుచేస్తామని కేసీఆర్ హామీ
ఏ ఊరైనా, తండా అయినా తనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి మండలంలో చెరువులు ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ఆయా నియోజక వర్గాలలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించారు. వచ్చే బడ్జెట్ లో సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేస్తామని, ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, తండాకు రూ.10 లక్షలు కేటాయించనున్నట్టు చెప్పారు. సూర్యాపేటలో బంజారా భవన్ నిర్మిస్తామని, పుల్లారెడ్డి చెరువును బాగుచేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పెంచాలని ప్రజలకు సూచించారు.