టీడీపీ: టీడీపీని ఇబ్బందిపెట్టాలని చూస్తే, జగన్ పైనా సినిమా తీసే వాళ్లున్నారు: ఎమ్మెల్యే అనిత
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై స్పందించిన అనిత
- రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకనే ఈ సినిమా
- జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే పాదయాత్ర కూడా చేయలేరు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రూపొందించడం వెనుక వైసీపీ నేతల పాత్ర ఉందని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపించారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పందిస్తూ, ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు.
రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే, వైసీపీ నేతలు ఈ సినిమా తీస్తున్నట్టు ఉందని అన్నారు. ఎన్టీఆర్ పై సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తే, జగన్ పైనా సినిమా తీసే వాళ్లు ఉన్నారని అన్నారు. జగన్ జీవిత చరిత్రను ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చేయలేరని అనిత అన్నారు.