శివబాలాజీ: ఎలా నటించాలనే విషయం ఆ సినిమా నుంచే నేర్చుకున్నా: నటుడు శివబాలాజీ
- మొదటి సినిమాలో నా నటన నాకు నచ్చలేదు
- ‘ఆర్య’ సినిమా నుంచే ఎలా నటించాలనే విషయం నేర్చుకున్నా
- జయాపజయాల గురించి మనం ఆలోచించకూడదు
- ‘రేడియో సిటీ’లో శివబాలాజీ
‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’తో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన నటుడు శివబాలాజీ ఆ తర్వాత ‘ఎలా చెప్పను’, ‘దోస్త్’, ‘ఆర్య’.. 'కాటమరాయుడు' చిత్రాల్లో నటించాడు. ‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతగా నిలిచిన శివబాలాజీ ఇటీవల హైదారాబాద్ లోని ఎఫ్ఎం రేడియో ‘రేడియో సిటీ’ కి వెళ్లాడు. ఈ సందర్భంగా శివబాలాజీ అక్కడ మాట్లాడుతూ, తన మొదటి చిత్రం ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ లో తన నటన తనకు నచ్చదని చెప్పాడు. తన రెండో సినిమా ‘ఎలా చెప్పను’లో కూడా తాను ఇంకా బాగా నటించవచ్చని తనకు అనిపిస్తుందని చెప్పాడు.
‘ఆర్య’ సినిమా నుంచే నటన ఎలా చేయాలి? పోషించే పాత్రకు ఎలా న్యాయం చేయాలనే విషయాలను నేర్చుకున్నానని,‘ఆర్య’ సినిమాలో బాగానే నటించానని అనుకుంటున్నానని, అప్పటి నుంచే తన సినీ ప్రయాణం మొదలైనట్టుగా తాను భావిస్తానని చెప్పాడు. జయాపజయాల గురించి మనం ఆలోచించకూడదని, మనల్ని మనం మోసం చేసుకోకూడదని ఓ ప్రశ్నకు సమాధానంగా శివబాలాజీ చెప్పాడు.