ముస్లిం: శ్లోకాలు తప్పుగా పఠిస్తున్నాడని ఫోక్ సింగర్ ను చంపేసిన పూజారి.. గ్రామాన్ని విడిచి పారిపోయిన 200 మంది ముస్లింలు
- రాజస్థాన్‌లోని దంతల్ లో హత్య
- శ్లోకాలు తప్పుగా చదువుతున్నాడని తన సోదరులతో కలిసి చంపేసిన పూజారి
- పూజారి అరెస్ట్.. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు
- గ్రామంలో ఘర్షణపూరిత వాతావరణం
రాజస్థాన్‌లోని ఓ గ్రామం నుంచి 200 మంది ముస్లింలు పారిపోవడం అలజడి రేపుతోంది. ఆ రాష్ట్రంలోని దంతల్ అనే గ్రామంలో గత నెల 27న ఓ పూజారి, అతడి సోదరులు కలిసి ముస్లిం ఫోక్ సింగర్ ను హత్య చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో 20 కుటుంబాలకు చెందిన 200 మంది ఊరు విడిచి అదే రాష్ట్రంలోని జైసల్మెర్‌కి వెళ్లిపోయారు. అక్కడ తమకు ఉండడానికి గూడు లేక నానా కష్టాలు పడుతున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు మాట్లాడుతూ... సదరు ఫోక్ సింగర్ అహ్మద్ ఖాన్ శ్లోకాలు పఠిస్తూ గానం చేస్తూ ఉండేవాడని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్లోకాల్లో తప్పులు దొర్లుతున్నాయని, వాటిని పఠించకూడదని స్థానిక పూజారి రమేష్ సుతార్ గొడవపెట్టుకుని, తన ఇద్దరు సోదరులతో కలిసి అహ్మద్ ఖాన్‌ను చంపేశాడని చెప్పారు. అప్పటి నుంచి హిందువులు, ముస్లింలు గొడవలు పడుతున్నారని, అందుకే ముస్లింలు ఊరు విడిచి వెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై అక్కడి కలెక్టర్ కేసీ మీనా మాట్లాడుతూ.. ఇరు కమ్యూనిటీలతో తాము చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఊరు విడిచి వెళ్లిన ముస్లింలు మళ్లీ తమ గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో పూజారిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.