చంద్రబాబు: సచివాలయంలో ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు
- రాజధాని నిర్మాణం, రైతు రుణమాపీ మూడో దశ అమలుపై ప్రధానంగా చర్చ
- ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకానికి మంత్రివర్గం ఆమోదం
- మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ఎస్ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం
- పలు ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదుల ఏర్పాటుపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. సుదీర్ఘంగా కొనసాగుతోన్న ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, రైతు రుణమాఫీ మూడో దశ అమలు, పుల్లెల గోపీచంద్ అకాడమీతో పాటు ఇతర సంస్థలకు భూ కేటాయింపులు, సిటిజన్ ఛార్టర్ అమలు, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, చక్రపాణి కమిటీ నివేదికతో పాటు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
బీసీ సామాజిక వర్గంలో పెళ్లి చేసుకునే పేద వధూవరులకు ‘చంద్రన్న పెళ్లి కానుక’ పేరుతో రూ.30వేలు అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018 జనవరి 1 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదులు ప్రవేశపెట్టే అంశంపై కూడా చర్చించారు. పోలవరం కుడి కాలువకు ఆనుకుని ఐదో నంబర్ జాతీయ రహదారిని 8వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ఎస్ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.