చిరంజీవి: చిరంజీవి గారంటే నాకు ప్రాణం.. నాలో ఇంజెక్ట్ అయిపోయారు: ‘జోష్’ రవి
- నా బలాలు బలహీనతలు అన్నీ చిరంజీవిగారే
- ఇమిటేట్ చేయడానికి కారణం .. ఆయన్ని నేను అంతగా అభిమానిస్తా
- చిరంజీవిగారి యాక్టింగ్ లో నాకో ఫైర్ కనబడుతుంది
మెగాస్టార్ చిరంజీవిని హాస్యనటుడు ‘జోష్’ రవి అనుకరిస్తాడని అంటారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, అసలు, చిరంజీవిని ఎందుకు అనుకరిస్తాననే విషయాన్ని ‘ఐడ్రీమ్స్’ ఇంటర్వ్యూలో రవి స్పష్టంగా చెప్పాడు. ‘చిరంజీవి గారంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి రాకముందే నాలో చిరంజీవి గారు ఇంజెక్ట్ అయిపోయారు. నేను ఆయన్ని అంతగా ప్రేమించాను. తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు.. చిరంజీవిగారి పోస్టర్లను కట్ చేసి నాకు నచ్చిన పోస్టర్లను గోడకు అంటించుకునేవాడిని. సౌండ్స్ కు.. మా అమ్మ కంగారు పడి లేచేది. ఇదంతా మా అమ్మకు తెలియకుండా చేసే వాడిని... ఓ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు మా అమ్మ లేచి అలానే చూస్తూ కూర్చుంది. ‘ఏంటిరా ఈ పిచ్చి నీకు..చిరంజీవిని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని ఆయనకు తెలిస్తే ఎంతగా ఆనందిస్తారో!’ అని మా అమ్మ నాతో అనేది.
ఈ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ నాకు ఆనందంగా ఉంటుంది. మన కోరిక బలంగా ఉంటే, ఏదైనా మనం సాధించగలం. నాకు సినిమా తప్పా ఇంకోటి తెలియదు. నేను అదే చేస్తాను. చిరంజీవిగారిని ఇమిటేట్ చేయడానికి కారణం .. ఆయన్ని నేను అంతగా అభిమానిస్తున్నాను. కష్టపడి పైకి రావడమంటే నాకు తెలిసి చిరంజీవిగారే. ఒక సామాన్యమైన వ్యక్తి ఓ గొప్ప స్థాయికి వెళ్లడానికి ఉదాహరణ చిరంజీవి గారు.
నేను పెరిగిన వాతావరణంలో అందరూ చిరంజీవిగారి ఫ్యాన్సే. అందరి హీరోల సినిమాలు చూస్తా, వారితో నటించాలని నాకు ఉంది. కానీ, చిరంజీవిగారి యాక్టింగ్ లో నాకో ఫైర్ కనబడుతుంది. నా బలాలు, బలహీనతలు అన్నీ చిరంజీవిగారే. నాకు ఏదైనా బాధ కలిగితే చిరంజీవి గారి సినిమాలు చూస్తాను. చిరంజీవి గారిని నాకు తెలియకుండానే అనుకరిస్తా..ఇకపై తగ్గించుకుంటాను’ అని ‘జోష్’ రవి చెప్పుకొచ్చాడు.