చంద్రబాబు: తెలంగాణ ఆదాయం 53 శాతం, ఏపీ ఆదాయం 47 శాతం.. అయినా అక్కడి కన్నా ఎక్కువ రుణమాఫీ: చంద్రబాబు
- మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభం
- రాష్ట్ర ఆదాయం తక్కువ, అయినప్పటికీ ఒక్కో రైతుకి లక్షన్నర రుణమాఫీ
- తెలంగాణలో లక్ష రూపాయలు మాత్రమే
- మూడో విడత కింద 36.72 లక్షల మంది రైతులకు మొత్తం రూ.3,600 కోట్లు
రైతుల కష్టాలు తీర్చే అవకాశం తనకు వచ్చిందని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తంగడంచలో చంద్రబాబు నాయుడు మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు 208 రోజులు పాదయాత్ర చేశానని అన్నారు. అప్పట్లో తన కాలు కూడా దెబ్బతిందని, డాక్టర్లు నడవకూడదని చెప్పారని తెలిపారు. కానీ తానో సంకల్పం చేశానని, ప్రజల స్థితిగతులను నేరుగా చూడాలనుకున్నానని తెలిపారు.
రైతుల కష్టాలను గురించి తెలుసుకున్నానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ఆదాయం 53 శాతంగా ఉండేదని, ఆంధ్రప్రదేశ్ ఆదాయం 47 శాతం ఉండేదని చెప్పారు. ఏపీ జనాభా 58 శాతం, తెలంగాణ జనాభా 42 శాతం అని చెప్పారు. తెలంగాణలో లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తే, తాము మాత్రం లక్షా యాభై వేల రూపాయలు చేస్తామని చెప్పామని అన్నారు.
రైతుల కళ్లలో ఆనందం చూడాలన్న ఏకైక ధ్యేయంతో ముందుకు వెళ్లానని చెప్పారు. ఇంకా రెండే ఇన్‌స్టాల్ మెంట్లు ఇవ్వాలని చెప్పారు. రైతులు దిగులు పడడానికి వీల్లేదని చెప్పారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. మూడో విడత కింద 36.72 లక్షల మంది రైతులకు మొత్తం రూ.3,600 కోట్లు ఇస్తున్నామని చెప్పారు.