ఓంకార్: ఆ విషయం మొదట్లో నాగార్జునకు తెలియదు: దర్శకుడు ఓంకార్
- ‘రాజుగారి గది 2’లో నాగార్జున నటిస్తున్నట్టు సమంతకు తెలుసు
- సమంత నటిస్తున్నట్టు నాగ్ కు తర్వాత తెలిసింది
- క్లైమాక్స్ లో నాగార్జున, సమంత నటన అద్భుతం
- ఓ ఇంటర్వ్యూలో ఓంకార్
‘రాజుగారి గది-2’లో ఆత్మ పాత్రలో సమంత నటిస్తున్న విషయం నాగార్జునకు ముందుగా తెలియదని, ఆ తర్వాత ఈ విషయం తెలిసిందని ఈ చిత్ర దర్శకుడు ఓంకార్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ కథ రాసుకున్న తర్వాత ముందుగా నాగార్జున తమ ప్రాజెక్ట్ లోకి వచ్చారని, ఓ నెల రోజుల తర్వాత సమంత వచ్చిందని చెప్పారు.
ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నట్టు సమంతకు తెలుసు గానీ, సమంత నటిస్తున్నట్టు నాగార్జునకు ముందుగా తెలియదని, ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. ‘రాజు గారి గది’ చిత్రంలోలానే ‘రాజు గారి గది 2’లో కూడా మెస్సేజ్ ఉంటుందని, మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించాలనేదే ఈ మెస్సేజ్ అని చెప్పుకొచ్చారు.
‘రాజు గారి గది 2’లో ఆత్మ క్యారెక్టర్ లో సమంత నటన అద్భుతమని, ఆమె కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో నాగార్జున, సమంత నటన అందరినీ ఆకట్టుకుంటుందని, బాలీవుడ్ ధూమ్ సిరీస్ ఏ విధంగా విజయవంతమైందో, ‘రాజుగారి గది’ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందని ధీమాగా చెప్పారు. ఈ సిరీస్ లో రాజుగారి గది 3, 4 కూడా ఉంటాయని అన్నారు. కాగా,రాజు గారి గది 2 చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.