వాద్ నగర్: చిన్ననాటి పాఠశాలకు వెళ్లిన మోదీ.. భావోద్వేగం!
- భద్రతా సిబ్బందిని పక్కనబెట్టి నడుచుకుంటూ వెళ్లిన ప్రధాని
- మోకాలిపై కూర్చుని పాఠశాల మట్టిని తాకిన మోదీ
- మహాశివుడు నాకు తిరుగులేని శక్తి నిచ్చాడన్న వైనం
గుజరాత్ లోని తన స్వస్థలమైన వాద్ నగర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వెళ్లారు. మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన గ్రామానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను సందర్శించారు. భద్రతా సిబ్బందిని అక్కడే ఉండమని చెప్పిన మోదీ, స్వయంగా నడుచుకుంటూ అక్కడికి వెళ్లి, మోకాలిపై కూర్చుని పాఠశాలలోని మట్టిని తాకుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా అక్కడి వారిని మోదీ పలకరించారు. అనంతరం, భరుచ్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ రోజున ఇంతటి స్థాయిలో ఉండడానికి కారణం తన నేల తల్లి నేర్పిన సంస్కారమే అని అన్నారు. తన ప్రయాణాన్ని వాద్ నగర్ నుంచి ప్రారంభించానని, ఇప్పుడు వారణాసి చేరుకున్నానని చెప్పిన మోదీ, ఈ రెండు ప్రాంతాలు పరమశివుడి ప్రాంతాలేనని, తిరుగులేని శక్తిని ఆ మహాదేవుడు తనకు ఇచ్చాడని అన్నారు. ఈ మట్టి నుంచి తాను అందుకున్న అతిపెద్ద బహుమతి ఇదే అని పేర్కొన్నారు.