పెట్రోల్ బంక్: ఈ నెల 13న పెట్రోల్ బంక్ ల బంద్
- ’పెట్రో’ డీలర్ల ప్రకటన
- డీలర్ల కమీషన్ పై ఓ నిర్ణయానికి రాని కేంద్రం
- డిమాండ్లను పరిష్కరించకపోతే 27 నుంచి నిరవధిక బంద్ చేపడతామని డీలర్ల హెచ్చరిక
డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకూ కేంద్రప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. ఈ మేరకు పెట్రో డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న 54 వేల పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. ఈ బంద్ కు దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించినట్టు సంబంధిత నాయకులు చెప్పారు.
రోజు వారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పిన పెట్రోలియం శాఖ ఇప్పటికీ విధివిధానాలను రూపొందించలేదని, జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈ నెల 27 నుంచి పెట్రోల్ బంకుల నిరవధిక బంద్ కు దిగుతామని హెచ్చరించారు.