చంద్రబాబు: సీఎం చంద్రబాబు ఇంటి ముందు తెలంగాణ మంత్రి తలసాని!
- హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం ముందు తలసాని కాన్వాయ్
- చుట్టుముట్టిన మీడియా
- ట్రాఫిక్ జామ్ అవడంతో ఇటుగా వచ్చానని చెప్పిన తలసాని
టీటీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు ఇంటి ముందు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ వచ్చి ఆగింది. దీంతో, అక్కడే ఉన్న మీడియా ఆశ్చర్యపోయింది. వెంటనే తలసాని కాన్వాయ్ వద్దకు మీడియా వెళ్లడంతో, ఆయన వెనుదిరిగారు.
అయితే, చంద్రబాబు నివాసం వైపు రావడంపై తలసానిని మీడియా ప్రశ్నించగా, ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్ నెం.36 వైపు వెళ్లే నిమిత్తం ఇటువైపు రావాల్సి వచ్చిందని, చంద్రబాబు ఇక్కడ ఉన్న విషయం తనకు తెలియక వచ్చానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, తలసాని పొరపాటున చంద్రబాబు నివాసం వైపు వచ్చారా? లేక బాబును కలిసేందుకే వచ్చారా? అనే విషయమై రాజకీయంగా చర్చ జరుగుతోంది.