కోదండరామ్: అందుకే ప్రజలు ‘ఎవరిపాలయిందిరో తెలంగాణ’ అని పాడుకుంటున్నారు: కేసీఆర్‌పై కోదండరామ్ ఆగ్రహం
- కేసీఆర్ మూడేళ్ల అసమర్థ పాలన వల్లే ఈ దుస్థితి
- ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేశారు
- ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదు
- టీచర్ ఉద్యోగాలపై కేసీఆర్ వ్యాఖ్యలు బాగోలేవు
ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ప్రొ.కోదండరామ్ ప్రశ్నించారు. నిన్న తనపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కోదండరామ్ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాను అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే కేసీఆర్ తనపై విరుచుకుపడ్డారని తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తన పోరాటం ఆగబోదని చెప్పారు.
కేసీఆర్ మూడేళ్ల అసమర్థ పాలన చూసి తెలంగాణ ప్రజలు 'ఎవరిపాలయిందిరో తెలంగాణ' అని పాట పాడుకుంటున్నారని కోదండరామ్ అన్నారు. ప్రజలు తమ బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి ఈ పాట పాడుకుంటున్నారని తెలిపారు. టీచర్ ఉద్యోగాలపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన పడుతోంటే ఇప్పట్లో ఆ ఉద్యోగాలు ఇవ్వకపోతే నష్టమేం లేదన్నట్లు కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. 1200 మంది అమరుల త్యాగాన్ని కేసీఆర్ మర్చిపోయారని కోదండరామ్ ధ్వజమెత్తారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.