కసాయి: డబ్బు కోసం బాలుడిని అపహరించి.. కాల్వలో ముంచి చంపేసిన కసాయిలు
- విజయవాడలోని కృష్ణలంకలో ఘటన
- లక్ష రూపాయలు డిమాండ్ చేసిన నిందితులు
- డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో బాలుడి హత్య
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బు కోసం ఓ బాలుడిని అపహరించి, కాల్వలో నీట ముంచి చంపేశారు. మరిన్ని వివరాలు చూస్తే... కృష్ణలంకలోని నడింపల్లి కనకారావు కుమారుడు శివచరణ్ (8) బయటకు వెళ్లి నిన్న రాత్రి 10 గంటలు అవుతున్నా ఇంటికి రాలేదు. అదే సమయంలో ఆ బాలుడి తండ్రి కనకారావుకు ఫోన్ వచ్చింది. లక్ష రూపాయలు ఇస్తే ఆ బాలుడ్ని ఇస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించారు.
భయపడిపోయిన కనకారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శివచరణ్‌ను అపహరించింది ఐస్ అమ్ముకుని జీవించే షేక్‌మస్తానని ఎట్టకేలకు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు కిషోర్ అనే వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు.
కనకారావు తమ వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఆ బాలుడిని బాలాజీనగర్ జాతీయ రహదారి పక్కన శ్మశానవాటిక వద్ద బందరు కాల్వలో నీట ముంచి హత్య చేసినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుడు కిషోర్ కోసం గాలిస్తున్నారు.