కేసీఆర్: చిరంజీవి పార్టీ పెడితే.. ప్రజలు ఆ పార్టీని కట్టెల మోపును కింద పడేసినట్లు పడేశారు!: కేసీఆర్
- ఎవరికి వారు పార్టీలు పెట్టుకుంటే అవి నడవబోవు
- ఎన్టీఆర్ అంటే ప్రజల్లో విశ్వసనీయత ఉండేది
- ఎవడు ఏలుతున్నాడురా తెలంగాణ? అని కోదండరామ్ పాటతో ప్రచారం చేశారు
- ప్రజలు ఎన్నుకున్నవారే ఏలుతున్నారు
గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌తో కలిసి టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ కాంగ్రెస్‌కు మేనిఫెస్టో రాశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయినా ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి పార్టీ పెడితే ప్రజలు ఆ పార్టీని కట్టెల మోపును కింద పడేసినట్లు పడేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఎవరికి వారు పార్టీలు పెట్టుకుంటే అవి నడవబోవని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్టీఆర్ మూడుతరాల నటుడని, తెలుగు ప్రజల మద్దతుతో సరైన సమయంలో పార్టీ పెట్టారని, గొప్పవారయ్యారని చెప్పారు. ఎన్టీఆర్ కి ప్రజల్లో విశ్వసనీయత ఉందని అన్నారు.
ప్రొ. కోదండరామ్ ఓ పాటను ప్రచారం చేస్తున్నారని, ఆ పాటలో ఎవడు ఏలుతున్నాడురా తెలంగాణని? అని వస్తుందని.. ప్రజలు ఎన్నుకున్న వారే రాష్ట్రాన్ని ఏలుతున్నారని కోదండరామ్‌కి ఎందుకంత కడుపుమంట? అని కేసీఆర్ చురకలంటించారు.