సింగరేణి: మాకు ప్రత్యామ్నాయం అన్నారు.. సింగరేణి ఎన్నికల్లో వాళ్లకొచ్చిన ఓట్లు 246 మాత్రమే!: బీజేపీపై సీఎం కేసీఆర్ విసుర్లు
- టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రచారం చేస్తున్నారు
- 9 డివిజన్లలో ఏకపక్షంగా గెలిచాం
- ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి
- మీడియా సమావేశంలో కేసీఆర్
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారని, సింగరేణి ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 246 ఓట్లు మాత్రమే వచ్చాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 45 శాతం ఓట్లు వచ్చాయని, ఇంతవరకూ ఇంత పెద్ద మెజార్టీ గెలిచిన సంస్థ లేదని అన్నారు. 11 డివిజన్లలో 9 డివిజన్లను ఏకపక్షంగా గెలుచుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, చరిత్రలో అద్భుతమైన పనులకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టిందని ఈ సందర్బంగా కేసీఆర్ చెప్పారు.
ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా మూడేళ్లలో బంగారు తెలంగాణ సాధిస్తామని తామెప్పుడూ చెప్పలేదని, ఆ దిశగా ప్రయాణిస్తున్నామని మాత్రమే చెప్పామని అన్నారు. దళితులు, పేదలు, మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్నామని, బీసీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తామని చెప్పామని అన్నారు.