రోడ్డు ప్రమాదం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొని ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి
- కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ప్రమాదం
- ఒక్కసారిగా అదుపు తప్పిన కారు
- పాదచారితో పాటు కారులోని ఓ మహిళ మృతి
- పలువురికి గాయాలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఘోర కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మార్గం గుండా వేగంగా వెళుతున్న ఓ కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొని ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఢీ కొన్న వ్యక్తితో పాటు కారు అలాగే 50 మీటర్ల మేర ముళ్లపొదల్లోకి ముందుకు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఆ పాదచారితో పాటు కారులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.