modi: భారత ఆర్థికాభివృద్ధిపై ఇలాగేనా విమర్శలు చేసేది!: మోదీ ఆగ్రహం
- ఈ ఏడాది ఏప్రిల్-జూన్ లో వృద్ధిరేటు తగ్గింది
- గత ప్రభుత్వాల పాలనలో కూడా పలుసార్లు వృద్ధిరేటు తగ్గింది
- కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు
- రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిరేటు 7.7 శాతం ఉంటుంది
భారత ఆర్థికాభివృద్ధిపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో కంపెనీ సెక్రటరీలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ... పెద్ద నోట్ల రద్దు తర్వాత జీడీపీ నిష్పత్తిలో నగదు 9 శాతానికి తగ్గిందని, గత ఏడాది నవంబరుకు ముందు జీడీపీ నిష్పత్తిలో నగదు 12 శాతం ఉండేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ లో వృద్ధిరేటు తగ్గిందని అంగీకరిస్తున్నానని అన్నారు.
అయితే, గత ప్రభుత్వాల పాలనలో కూడా పలుసార్లు వృద్ధిరేటు తగ్గిందని మోదీ గుర్తు చేశారు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిరేటు 7.7 శాతం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిందని తెలిపారు. కాగా, కొందరు బయటకు వచ్చి తమ వ్యాఖ్యలతో నిరాశావాదాన్ని సమాజంలోకి వదిలి, మళ్లీ ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోతున్నారని మోదీ అన్నారు. ఆర్థిక వృద్ధి బాగోలేదు కాబట్టి ఇప్పట్లో జీఎస్టీని అమలు చేసి ఉండాల్సింది కాదని మరి కొందరు అంటున్నారని వ్యాఖ్యానించారు. భారత ఆర్థికాభివృద్ధి కోసం తాము కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని తెలిపారు.