ఏపీ బడ్జెట్: ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించాం: మంత్రి యనమల
- 2018-19 బడ్జెట్ తయారీపై ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి భేటీ
- టీడీపీ మేనిఫెస్టో ఆధారంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యం
- మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత
ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించామని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 2018-19 బడ్జెట్ తయారీపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. వివిధ శాఖలకు కేటాయింపులు, ఖర్చులు లెక్కలు తీయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గతంలో ఆయా శాఖలు పెట్టిన ఖర్చులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని, టీడీపీ మేనిఫెస్టో ఆధారంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని, ఏపీ బడ్జెట్ సమావేశాలు యథావిధిగా మార్చిలోనే జరుగుతాయని యనమల పేర్కొన్నారు.
గృహనిర్మాణం, కొత్త పింఛన్లకు ఎక్కువ కేటాయింపులతో బడ్జెట్ ఉండాలని, బడ్జెట్ తయారీ సమయంలో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించేలా పథకాలు ఉంటాయని ఈ సందర్భంగా యనమల పేర్కొన్నారు.