మీసాలు: స్టైలుగా మీసాలు తిప్పుతూ.. అగ్రకులాలవారికి సవాలు విసురుతున్న దళిత యువకులు
- వినూత్న రీతిలో నిరసన
- మీసం పెంచుకుంటే అగ్రకులాల వారు కొట్టడం ఏంటని ఆవేదన
- మీసాలు ఇలాగే తిప్పుతామని తెగేసి చెబుతున్న యువకులు
తమ మీసాలను స్టైలుగా తిప్పుతూ దళిత యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఘటన గుజరాత్‌లో జరిగింది. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో మీసాలు పెంచుకున్న ఇద్దరు దళిత యువకులను రాజ్‌పుత్‌లు ఇటీవల చావగొట్టిన విషయం తెలిసిందే. అయితే, అగ్రకులాల వారు ఎంత అహంకారంగా ప్రవర్తించినా తాము మాత్రం భయపడబోమని మీసాలు తిప్పుతూనే ఉంటామని దళిత యువకులు తేల్చిచెప్పారు. వాట్సప్‌లో మిస్టర్ దళిత్ అని గ్రూప్‌ను క్రియేట్ చేసి మీసం మెలేస్తోన్న ఫొటోలను పెడుతున్నారు.
అదేదో తప్పు చేస్తే కొట్టినట్లు.. మీసం పెంచుకుంటే కొట్టడం ఏంటని ఆ యువకులు ఆవేదన చెందుతున్నారు. తాము ఇలాగే మీసం తిప్పుతామని తెగేసి చెబుతున్నారు. కాగా, దళిత యువకులు స్టైలుగా మీసం పెంచుకున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేసిన వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.