కువైట్: వీసా ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ నా భార్యను అమ్మేశాడు!: చిత్తూరు జిల్లా వాసి ఫిర్యాదు
- చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటన!
- వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్
- భార్య కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించిన భర్త
జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లాలనుకున్న ఓ మహిళకు వీసా తెప్పిస్తానంటూ ఓ ఏజెంట్ మోసానికి పాల్పడ్డాడు. ఆ మహిళను ఎక్కడో అమ్మేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై ఆ మహిళ భర్త శెట్టిపల్లె వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మదనపల్లి మండలం కొండామారిపల్లె పంచాయతీలోని బాలాజీనగర్ లో వెంకటరమణ, భార్య రాధ నివసిస్తున్నారు. వృత్తి రీత్యా పెయింటింగ్ పని చేసే వెంకటరమణకు వచ్చే సంపాదనతో తన భార్యాపిల్లలను పోషించుకోవడం కష్టమైంది.
ఈ నేపథ్యంలో భార్య రాధను కువైట్ పంపించాలని భావించి ఆమెకు పాస్ పోర్టు కూడా తీసుకున్నాడు. వీసా నిమిత్తం అక్కడి కృష్ణానగర్ లో ఉంటున్న ఏజెంట్ రెడ్డి బాషాను సంప్రదించాడు. వీసా తెప్పిస్తానంటూ సదరు ఏజెంట్ నమ్మబలికాడు. అయితే, మూడు రోజుల నుంచి రాధ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో నిన్న పోలీసులను ఆశ్రయించిన వెంకటరమణ, సదరు ఏజెంట్ పై ఫిర్యాదు చేశాడు. వీసా ఇప్పిస్తానంటూ తన ఇంటికి ఆ ఏజెంట్ వస్తుండేవాడని, తన భార్యను తీసుకెళ్లి అతనే ఎక్కడో అమ్మేశాడంటూ ఆ ఫిర్యాదులో ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.