రాహుల్: రాహుల్ గాంధీ ఇటాలియన్ కళ్లజోడు తీసేసి చూడాలి: అమిత్ షా
- పోరుబందరులో బీజేపీ గుజరాత్ గౌరవ్ యాత్ర
- యాత్రలో పాల్గొని రాహుల్ పై చురకలంటించిన అమిత్ షా
- బీజేపీ మూడేళ్లలో ఏం చేసిందని రాహుల్ అంటున్నారు
- గుజరాత్ కళ్లజోడు పెట్టుకొని రాహుల్ చూడాలి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మూడేళ్లలో ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
ఈ రోజు పోరుబందరులో గుజరాత్ గౌరవ్ యాత్రలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ... ‘కేంద్ర సర్కారు ఈ మూడేళ్లలో గుజరాత్‌కు ఏం చేసిందని కాంగ్రెస్ అడుగుతోంది. మోదీ ప్రభుత్వం గుజరాత్‌కు ఎయిమ్స్, రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, పేదలకు ఆరు లక్షల గృహాలను నిర్మించి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అయినప్పటికీ రాహుల్ గాంధీకి ఇవేమీ కనపడడం లేదు’ అని అన్నారు.
‘రాహుల్ ఇటాలియన్ గ్లాసెస్ పెట్టుకున్నంత కాలం ఇవేవీ చూడలేరు. జరుగుతోన్న అభివృద్ధిని చూడాలంటే ఇటాలియన్ కళ్లద్దాలను తీసేసి గుజరాతీ గ్లాసెస్‌ను పెట్టుకోవాలి’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ కలలు కంటోందని, ప్రతి ఒక్కరికీ కలలు కనే హక్కు ఉందని అమిత్ షా చురకలంటించారు. కానీ, కలలను నిజం చేసుకునే క్రమంలో కష్టపడాలని, రాహుల్ గాంధీ మాత్రం యూఎస్ టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చారని అమిత్ షా విమర్శించారు.