పాక్ కాల్పులు: ముగ్గురు భారత చిన్నారులను కాల్చి చంపిన పాక్ సైన్యం
- ఫూంచ్ జిల్లాలో మరోసారి పాక్ కాల్పులు
- ఓ బాలిక, ఇద్దరు బాలురు మృతి
పాకిస్థాన్ సైన్యం ముగ్గురు భారత చిన్నారులను కాల్చి చంపింది. భారత సైన్యం నుంచి హెచ్చరికలు వస్తున్నా సరిహద్దుల్లో తరుచూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్థాన్.. ఈ రోజు ఉదయం జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో మరోసారి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పదిహేనేళ్ల జాస్మిన్ అక్తర్ అనే బాలిక, పదేళ్లలోపు వయస్సు గల ఇస్రార్, అహ్మద్ అనే బాలురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
పాకిస్థాన్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టిందని ఆర్మీ అధికారులు చెప్పారు. పాకిస్థాన్ రేంజర్లు సరిహద్దుల్లోని షాపూర్, కెర్నీ, కస్బా సెక్టార్లో ఆర్మీ పోస్టులు, ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తులే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడితే గట్టిగా బుద్ధి చెబుతామని ఇటీవలే భారత సైన్యం హెచ్చరించిన విషయం తెలిసిందే.