rape rescued: నరకకూపంలో అభాగ్యురాలు... వేలాది మంది అఘాయిత్యాలకు బలైన మగువ!

  • మోడల్ గా రాణించాలని భావించిన యువతి 
  • ఫొటోగ్రాఫర్ తో ప్రారంభమైన లైంగిక దాడి
  • వేలాది రేప్ లు.. వందలాది అబార్షన్లు 
  • 'ప్లీజ్ లెట్ మీ గో' పేరిట తన జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చిన మహిళ

'ప్లీజ్ లెట్ మీ గో' పేరిట తాజాగా ఒక పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకం ఒక అభాగ్యురాలి వాస్తవ జీవితం. లండన్ కు చెందిన ఓ మహిళ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి, జీవితంలో త్వరగా స్థిరపడాలని నిర్ణయించుకుంది. దీంతో తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో ప్రవేశించాలని భావించి 15 ఏళ్ల వయసులో, పేపర్లో వచ్చిన ఒక మోడలింగ్ ఏజెన్సీ ప్రకటన చూసి, ఆ కంపెనీకి ఫోన్ చేసింది. ఆ సంస్థ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఫొటోలు తీస్తానని చెప్పి, ఆశపెట్టి, ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని, తొలిసారి ఆమెను రేప్ చేశాడు. ఆ తర్వాత ఓ రోజు ఫోన్ చేసి, 'నేను వస్తున్నా సిద్ధంగా ఉండు, బయటికెళ్దామ'ని ఆర్డర్ వేశాడని తెలిపింది. పోలీసులకు చెబుతానంటే చంపేస్తానని బెదిరించాడని, కాసేపటికే వచ్చి బలవంతంగా ఒక హోటల్ కు తీసుకెళ్లాడని తెలిపింది.

 అక్కడ ముగ్గురు కాచుకుని కూర్చున్నారని, వారంతా తనను సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. అక్కడి నుంచి తనపై లైంగికదాడి ఆరంభమైందని తెలిపింది. ఈ విషయాలన్నీ డైరీలో రాసుకోవడంతో ఆమె తల్లి చూసి పోలీసులకి ఫిర్యాదు చేయగా, పోలీసు అధికారి వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుతూ, వాళ్లు ఎక్కడ గిల్లారు? ఎక్కడ గిచ్చారు? అంటూ వేధించాడని గుర్తు చేసుకుంది. ఇదేంటంటే కోర్టులో ఇలాగే అడుగుతారని అన్నాడని తెలిపింది. అంతేకాదు, ఆ ప్రాంతంలో తాను పెద్ద వేశ్యనని ఆ పోలీసధికారి తన తల్లికి చెప్పాడని ఆమె రాసింది.

దీంతో కుమార్తె తమను మోసం చేసిందని, చెడు వ్యసనాలకు అలవాటు పడిందని భావించి, తల్లిదండ్రులు తనను వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోగా, ఆమె హాస్టల్ లో చేరింది. అలా సుమారు 15 ఏళ్ల కాలంలో వేలాది మంది.. వేల సార్లు ఆమెను రేప్‌ చేశారు. అలా రేప్ చేసిన వారిలో భారతీయులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇరాక్, ఇరాన్‌ దేశస్థులే ఎక్కువమందని ఆమె చెప్పింది. వారే కాకుండా ఒక స్థానిక బ్రిటిష్‌ నాయకుడు కూడా తనపై అఘాయిత్యం చేశాడని తెలిపింది.

 వందల సార్లు అబార్షన్లు కూడా జరిగాయని ఆమె వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు బిడ్డల తల్లినయినట్టు చెప్పింది. తరువాత సుఖరోగాలు ఆమెను చుట్టుముట్టడంతో ఆమెను మానవ రవాణా ముఠాలు పక్కనపెట్టడం ప్రారంభించాయి. విటులు రావడం తగ్గిపోవడంతో ఆమె ఒకసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మానవ రవాణా ముఠాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 దీంతో మానవ రవాణా ముఠాలపై పెట్టిన కేసుల్లో ఆమె పేరును ప్రత్యక్ష సాక్షిగా పోలీసులు నమోదు చేశారు. అయితే, కాలక్రమంలో ఆమెకు మతిమరుపు పెరిగింది. ఒకసారి చెప్పిన మాటలకు రెండోసారి చెప్పిన మాటలు సరిపోలకపోవడంతో ఆమెను సాక్షిగా లండన్ పోలీసులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఓ పబ్లిషర్ ఆమెకు అండగా నిలిచాడు. ఆర్థికంగా ఆదుకున్నాడు. అతని ప్రోత్సాహంతో తన జీవితంలో చోటుచేసుకున్న దారుణాలకు 'ప్లీజ్ లెట్ మీ గో' పేరిట అక్షర రూపం ఇచ్చింది. ఈ పుస్తకం మానవ అక్రమ రవాణా వ్యవస్థ తీరును కళ్లకు కడుతోంది. ఎంతోమందిని కదిలిస్తోంది!
 

More Telugu News