స్పైడర్: గుంటూరులో ఎంపీ-ఎమ్మెల్యే మధ్య ‘స్పైడర్’ ఫ్లెక్సీల వివాదం!
- ‘స్పైడర్’ ఫ్లెక్సీలపై ఎంపీ గల్లా జయదేవ్ ఫొటో
- ఆ ఫ్లెక్సీలపై స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో గొడవ
- ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటిని తొలగించిన మునిసిపల్ సిబ్బంది
- మండిపడుతున్న ఎంపీ వర్గీయులు, మహేష్ బాబు అభిమానులు
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల సందర్భంగా ‘స్పైడర్’ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ ఫొటోలు ఉన్నాయి. దీంతో, ఆ ఫ్లెక్సీలపై తన ఫొటో లేదంటూ స్థానిక ఎమ్మెల్యే మనస్తాపం చెందారట. ఈ నేపథ్యంలో, ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ మునిసిపాలిటీ సిబ్బందిని ఆయన ఆదేశించడంతో వాటిని తీసివేశారట.
అదే సమయంలో ఈ ఫ్లెక్సీలను తొలగించవద్దంటూ ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో, సదరు ఎమ్మెల్యే తీరుపై ఎంపీ వర్గీయులు, మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఎంపీ వర్గీయులు సిద్ధపడినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, స్పైడర్ సినిమాపై తప్పుడు రివ్యూలు రాస్తున్నారంటూ తిరుపతిలో మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. స్థానిక సంధ్యా థియేటర్ వద్ద ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు.