ఫంగస్ సెలైన్: బాలుడికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించిన వైద్యులు.. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆసుపత్రిపై కేసు!
- ఫిట్స్ వచ్చాయని ఆసుపత్రికి వెళితే దారుణం
- ఫంగస్ తో నిండిన సెలైన్ కారణంగా మరింత అనారోగ్యం
- తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది
హైదరాబాదులో ఓ విద్యార్థికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించిన దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక రాంనగర్ కు చెందిన మనోహర్ లింగం కుమారుడు వంశీకృష్ణ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. అతనికి ఫిట్స్ రావడంతో ఈ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అక్కడి వైద్యులు ఫంగస్ ఉన్న సెలైన్ ను ఆ బాలుడికి ఎక్కించడంతో, అతను మరింత అనారోగ్యానికి గురయ్యాడు.
ఈ విషయమై వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వారు స్పందించలేదు. ఈ క్రమంలో వంశీకృష్ణ మేనమామ శ్రీనివాస్.. నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.