క్రికెట్: బెంగళూరు వన్డేలో చెప్పింది చెప్పినట్లు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్
- 100వ వన్డేలో 100 పరుగులు చేసిన మొట్టమొదటి ఆసీస్ ఆటగాడు వార్నర్
- ఈ రోజు బాగా ఆడతానని మీడియాతో చెప్పిన వార్నర్
- వన్డేల్లో వార్నర్‌కి ఇది 14 వ సెంచరీ
ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ రోజు 100వ వన్డే ఆడాడు. నేటి మ్యాచ్ గురించి ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ సిరీస్ ను కోల్పోవడం తమను చాలా బాధించిందని చెప్పిన విషయం తెలిసిందే. నాలుగో వన్డేను మాత్రం ఛాలెంజ్ గా తీసుకుని ఆడతామని, జట్టు విజయం కోసం పాటుపడతామని అన్నాడు. తన 100వ వన్డేలో సత్తా చూపిస్తానని వ్యాఖ్యానించాడు.
ఈ రోజు 334 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ బలంగా ఉన్న భారత్‌పై ఆ జట్టు గెలుస్తుందో లేదో కానీ, వార్నర్ తాను చెప్పిన మాటను మాత్రం అక్షరాలా నిజం చేసి చూపించాడు. ధాటిగా ఆడి తన 100వ వన్డేలో సెంచరీ బాదాడు. వార్నర్ తద్వారా ఓ రికార్డును కూడా నెలకొల్పాడు. 100వ వన్డేలో 100 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్ మొదటివాడు.
వన్డేల్లో వార్నర్‌కి ఇది 14 వ సెంచరీ. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆయన సాధించిన ఈ సెంచరీ ఆయనకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కాగా, గతంలో తాము ఆడుతోన్న 100వ వన్డేలో సెంచరీ బాదిన ఇతర ఆటగాళ్ల వివరాలు చూస్తే... క్రిస్ కయిర్న్స్, మొహమ్మద్ యూసఫ్, కుమార్ సంగక్కర, క్రిస్‌గేల్, మార్కస్, రామ్ నరేశ్ శర్వాన్ ఉన్నారు.