చంద్రబాబు: పోలవరం ఏపీ ప్రజల కల: ఢిల్లీలో చంద్రబాబు
- ప్రత్యేక ప్యాకేజీ అమలు కావాల్సి ఉంది
- అరుణ్ జైట్లీతో చర్చించాను
- పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలను అందించాము
పోలవరం ఏపీ ప్రజల కల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తాను ఢిల్లీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమస్యలు లేకుండా జరగాలంటే ఏడు మండలాలను ఏపీలో కలపాలని చెప్పానని అన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపిందని అన్నారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై వాదనలు జరిగాయని, ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు కావాల్సి ఉందని చెప్పారు. పోలవరంను పూర్తి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు. పోలవరంపై సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి అందించామని చెప్పారు.
ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని జైట్లీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. కాకినాడలో పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కూడా చర్చించామని అన్నారు.