కర్ణాటక మంత్రి ఆంజనేయులు: విద్యార్థిని ప్రశ్నలకు బిక్కమొహం వేసిన కర్ణాటక మంత్రి!
- ప్రభుత్వ పాఠశాలల తీరుపై మంత్రిని నిలదీసిన విద్యార్థిని
- సీఎం దృష్టికి తెచ్చినా ఫలితం లేదంటూ అసహనం
- కనీస సౌకర్యాలు కల్పించే వరకు ఉపన్యాసాలివ్వొద్దన్న విద్యార్థిని
కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించాలంటూ ప్రకటనలు గుప్పించడం సబబు కాదంటూ ఓ విద్యార్థిని మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆసక్తికర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. చిత్రదుర్గ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక సామాజిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం, వేదికపై నుంచి కిందకు దిగిన ఆయన, అక్కడున్న విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా, ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నయన జోగి అనే విద్యార్థిని స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, వసతులు లేవని, వాటిని పరిష్కరించాలంటూ మంత్రిని డిమాండ్ చేసింది. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించిన తర్వాతే వేదికలపై ప్రసంగాలు ఇవ్వాలంటూ ఆ మంత్రికి సదరు విద్యార్థిని సూచించడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకనే తాను ప్రైవేట్ పాఠశాలలో చేరానని చెప్పింది. ఆ సౌకర్యాలు కల్పిస్తే కనుక తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరతానని చెప్పిన నయన జోగి, తనతో పాటు మరో 30 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తానని అంది.
రాజకీయనాయకులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే కనుక, తాను ఇంగ్లీష్ మీడియం చదవడం మానేసి ప్రభుత్వ పాఠశాలలో చేరతానని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల విషయమై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు పలు మార్లు విన్నవించుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి ఎదుట ఎంతో ధైర్యంగా మాట్లాడిన నయన జోగిపై తోటి విద్యార్థులు ప్రశంసలు కురిపించారు.