ఎన్టీఆర్: తాతగారితో పోలిక వద్దు: జూ.ఎన్టీఆర్
- తాత నెగిటివ్ పాత్రల్లో నటించినా ఆయనను హీరోలాగే చూసేవారు
- ఈ సినిమాకు పనిచేసిన వారంతా నాకు మంచి స్నేహితులే
- ఈ సినిమాకు ఒప్పుకోవడం ప్రధాన కారణం కథే
తన తాత నందమూరి తారక రామారావు నెగిటివ్ పాత్రల్లో నటించినా ఆయనను హీరోలాగే చూసేవారని, ఆయనకున్న ఇమేజ్ అలాంటిదని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. తన ‘జై లవకుశ’ సినిమా విడుదలైన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన తాతలాంటి గొప్పనటుడితో తనకు పోలిక వద్దని అన్నాడు. ఈ సినిమాలో జై పాత్రలో నటించడం కొత్త అనుభవమని చెప్పాడు. సొంత ప్రొడక్షన్లో చేస్తున్నంత మాత్రాన తాను నిర్లక్ష్యంగా ఎన్నడూ వ్యవహరించలేదని తెలిపాడు.
ఈ సినిమాకు పనిచేసిన వారంతా తనకు మంచి స్నేహితులేనని ఎన్టీఆర్ అన్నాడు. తాను ఎన్నడూ ఒత్తిడికి గురికాలేదని చెప్పాడు. ఒకే సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సినిమాకు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథేనని అన్నాడు. మూడు పాత్రలు ఉన్నాయని ఒప్పుకోలేదని, కథ బాగుందనిపించాకే చేశానని చెప్పాడు.