హరీశ్ రావు: కంచ ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆయనకే మంచిది: హరీశ్ రావు
- ఒక కులాన్ని దూషించడం అనేది ఏ ఒక్కరికీ తగదు
- ఆ పుస్తకాన్ని నిషేధించాలని వైశ్యులు కోరారు
- ఐలయ్య వ్యాఖ్యలను సర్కారు తీవ్రంగా ఖండిస్తోంది
ప్రొ. కంచ ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆయనకే మంచిదని, ఒక కులాన్ని దూషించడం అనేది ఏ ఒక్కరికీ తగదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై హరీశ్ రావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఐలయ్య రాసిన పుస్తకంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వైశ్యులు తమకు వినతిపత్రం ఇచ్చారని చెప్పారు.
ఆ పుస్తకాన్ని నిషేధించాలని కోరారని తెలిపారు. తమ సర్కారు ఐలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఐలయ్య రాసిన ఆ పుస్తకాన్ని ఏ మేధావి కూడా ఆమోదించబోడని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.