కంచ ఐలయ్య: దమ్ముంటే ‘రెడ్డి’ అంటూ పుస్తకం రాయండి.. అలా రాస్తే చంపేస్తారని భయమా?: కంచ ఐలయ్యకు పరిపూర్ణానంద సవాల్
- విదేశీ మతంతో కలిసి ఐలయ్య కుట్ర
- నేను అడిగిన ప్రశ్నలకు ఐలయ్య నుంచి సమాధానం లేదు
- అమాయకులు కనిపిస్తే వారిపైనే ఆయన రాతలు రాస్తారు
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐలయ్యపై శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు కంచ ఐలయ్య, స్వామి పరిపూర్ణానంద ఓ టీవీ ఛానెల్ వేదికగా చర్చించుకున్నారు. బ్రాహ్మణులు, కోమట్లు అంటూ పుస్తకాలు రాస్తోన్న కంచ ఐలయ్య.. ‘రెడ్డి’ అంటూ ఒక్క పుస్తకం రాయగలడా? అని స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు.
పిరికివాళ్లుగా భావించిన వారి మీదే ఐలయ్య ఇటువంటి పుస్తకాలు రాస్తున్నారని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. రెడ్డి అని పేరు పెట్టి రాస్తే వారు ఐలయ్యను చంపేస్తారని, నరికి అవతల పడేస్తారని, అందుకే వారిపై పుస్తకాలు రాయడం లేదని అన్నారు. వారంటే ఐలయ్యకు భయం అని వ్యాఖ్యానించారు. అమాయకులు కనిపిస్తే వారిపైనే ఆయన రాతలు రాస్తారని ఆరోపించారు. ఆయన మేధావితనం పక్షపాత ధోరణిగా ఉందని అన్నారు.
తాను మాట్లాడిన దాంట్లో తప్పుంటే తప్పుందని చెప్పండని ఐలయ్యను పరిపూర్ణానంద అడిగారు. దమ్ముంటే రెడ్డిలపై ఓ పుస్తకం రాయండని సవాలు విసిరారు. విదేశీ మతంతో కలిసి ఐలయ్య కుట్ర పన్నారని చెప్పారు. తాను అడిగిన ప్రశ్నలకు ఐలయ్య నుంచి సమాధానం లేదని అన్నారు. అందరూ క్రైస్తవులుగా మారిపోవాలని కంచ ఐలయ్య ప్రచారం చేస్తున్నారని పరిపూర్ణానంద భావోద్వేగంతో మాట్లాడారు.