ప్రపంచ బ్యాంక్ చీఫ్: భారత ఆర్థికాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ బ్యాంక్ చీఫ్ ప్రశంసల జల్లు
- అభివృద్ధి చెందిన దేశాల నడుమ నిలిచేందుకు ఎక్కువ సమయం పట్టదు
- ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలు భేష్
- భారత్లో మౌలిక వసతుల కల్పన వేగంగా సాగుతోంది
- పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి
భారత ఆర్థికాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ బ్యాంక్ చీఫ్ జిమ్ యాంగ్ కిమ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ రోజు సర్వప్రతినిధి సభలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం భారత్లో మౌలిక వసతుల కల్పన వేగంగా సాగుతోందని అన్నారు. భారత్ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. ఇండియాలోని ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలను ఆయన కొనియాడారు. పరిస్థితులను చక్కగా అన్వయించుకుని భారత ఆర్థిక బలోపేతానికి అవి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతుల ఏర్పాటులో భాగంగా పెట్టే పెట్టుబడులకు లాభాలు త్వరగానే వస్తాయని జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. భారత్లో ఆరోగ్యం, రహదారులు, విద్య వంటివాటిపై పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రశంసించారు. ఐరోపా, అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల నడుమ నిలిచేందుకు భారత్కు ఎక్కువ సమయం పట్టదని ఆయన అన్నారు.