iaipal reddy: అబద్ధాలు ఆడడంలో మోదీ, కేసీఆర్ అన్నదమ్ములు: జైపాల్ రెడ్డి
- కేసీఆర్ ఇప్పుడు మాటల మనిషి కాదు...మూటల మనిషి
- జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తామన్నారు
- నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు
- కాకతీయ, భగీరథకు ఉన్న నిధులు రైతు రుణమాఫీికి ఎందుకు లేవు
అబద్ధాలు ఆడడంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదమ్ములని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఇందిరమ్మ రైతు బాటలో భాగంగా ఆయన మాట్లాడుతూ, మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో నల్లధనాన్ని బయటకు తీసుకుని వచ్చి జన్ ధన్ ఖాతాల్లో ఒక్కొక్కరి పేరిట 15 లక్షల రూపాయలు వేస్తానని అన్నారని గుర్తు చేశారు. అలాగే దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని, సుమారు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ఆయనలాగే కేసీఆర్ కూడా మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఇప్పుడు మాటల మనిషి కాదని, మూటల మనిషని ఆయన ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు ఉండే నిధులు, రైతు రుణమాఫీకి ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. ఎకరాకు 4 వేల రూపాయలు ఇస్తామని అంటున్నారని, ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 3,500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడడం కేసీఆర్ వైఫల్యం కాకపోతే ఏంటని ఆయన నిలదీశారు. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కనీసం ఒక్కో చీరకు 500 రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసి పంపణీ జరిపినా తాము మద్దతు పలికేవారమని ఆయన తెలిపారు.